Sivabalaji: నాకు వేరే పనేంలేదు... అధిక ఫీజులు వసూలుచేసే స్కూళ్లపై పోరాటమే పని: శివబాలాజీ

  • స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయన్న శివబాలాజీ
  • ఫీజుల కోసం ఒత్తిళ్లకు గురిచేస్తున్నారని వెల్లడి
  • సీఎం జోక్యం చేసుకోవాలన్న శివబాలాజీ అర్ధాంగి
Sivabalaji says he will continue fight against private schools over fees

ఇటీవల స్కూలు ఫీజుల విషయంలో టాలీవుడ్ నటుడు శివబాలాజీ దంపతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. హైదరాబాద్ మణికొండలోని మౌంట్ లిటేరా జీ స్కూల్లో తమ పిల్లలను ఆన్ లైన్ క్లాసుల నుంచి తొలగించారని, ఫీజలు తగ్గించమని కోరడమే తాము చేసిన నేరమైందని శివబాలాజీ తెలిపారు. చాలామంది తల్లిదండ్రులను ఇలాగే వేధిస్తున్న ఆ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన కొన్నిరోజులుగా డిమాండ్ చేస్తున్నారు. తాజాగా, శివబాలాజీ దంపతులు ఇదే అంశంపై మరోసారి స్పందించారు.

కరోనా కాలంలోనూ ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, అనేక స్కూళ్లలో ఇదే పరిస్థితి నెలకొందని తెలిపారు. ప్రైవేటు స్కూళ్లన్నీ ఓ ముఠాగా ఏర్పడినట్టు అర్థమవుతోందని ఆరోపించారు. ప్రస్తుతం తనకు వేరే పనేం లేదని, ఇకపై అధిక ఫీజులు వసూళ్లు చేసే స్కూళ్లపై పోరాడడమే పని అని స్పష్టం చేశారు. బాధిత తల్లిదండ్రులకు అండగా ఉంటానని తెలిపారు.

శివబాలాజీ అర్ధాంగి మధుమిత స్పందిస్తూ, ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా, ప్రైవేటు స్కూళ్లు అనేక రకాల ఫీజులతో మానసిక వేదనకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. తాము ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించినా, పూర్తి ఫీజు చెల్లించేవరకు పరీక్షలు రాయనివ్వబోమని చెబుతున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి ఈ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

More Telugu News