వెబ్ సీరీస్ లోకి దిగుతున్న బాలీవుడ్ హీరో!

02-10-2020 Fri 12:46
  • లాక్ డౌన్ లో ఓటీటీకి పెరిగిన ప్రాధాన్యత
  • ఇప్పటికే వెబ్ సీరీస్ లో కొందరు తారలు
  • మరుగున పడిన క్రీడలపై సల్మాన్ వెబ్ సీరీస్
  • ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన, స్క్రిప్ట్ వర్క్  
Salman Khan to produce web series
థియేటర్లకు ఇప్పుడు ఓటీటీ ప్లేట్ ఫామ్స్ సమాంతరంగా నిలుస్తున్నాయి. ఈ లాక్ డౌన్ లో వీటికి మరింత ప్రాధాన్యత పెరిగింది. భవిష్యత్తులో మరింతగా ఇవి రాజ్యమేలుతాయన్న అంచనాలు, వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలామంది వెబ్ సీరీస్ వైపు అడుగేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తారలు, దర్శకులు వెబ్ సీరీస్ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్ ఖాన్ కూడా అటువైపు అడుగేస్తున్నాడు. వెబ్ సీరీస్ నిర్మాణం చేబట్టాలని ఆయన నిర్ణయించుకున్నాడు. మన దేశంలో వెలుగులోకి రాకుండా మరుగునపడిన గ్రామీణ క్రీడలను వీటి ద్వారా అందరికీ తెలియజెప్పాలని, ఆయా క్రీడల్లో రాణించి సరిగా ప్రచారానికి నోచుకోని క్రీడాకారులకు వీటి ద్వారా ప్రాచుర్యం కల్పించాలని సల్మాన్ భావిస్తున్నాడట.

ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా దొరికిన ఖాళీ సమయంలో వీటి గురించి ప్రణాళికలు రూపొందించుకున్నాడని అంటున్నారు. వీటికి సంబంధించిన పరిశోధన, స్క్రిప్ట్ పనులు ఇప్పటికే మొదలైనట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ వెబ్ సీరీస్ నిర్మాణం మొదలవుతుందని సమాచారం. దీంతో మరికొంత మంది బాలీవుడ్ హీరోలు కూడా ఈ విషయంలో సల్మాన్ ని అనుసరించవచ్చని భావిస్తున్నారు.