రీమేక్ సినిమా కోసం చిరంజీవి ప్లానింగ్!

01-10-2020 Thu 21:30
Chiranjivi plans for his next flick
  • 'ఆచార్య' తర్వాత చిరంజీవి రెండు రీమేక్ లు 
  • 'లూసిఫర్' కు వినాయక్ దర్శకత్వం
  • స్క్రిప్ట్ పని చేస్తున్న ఆకుల శివ  

ప్రస్తుతం కొరటాల శివతో చిరంజీవి 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న సంగతి విదితమే. లాక్ డౌన్ కారణంగా ఆగిన ఈ చిత్రం షూటింగ్ త్వరలోనే మళ్లీ మొదలవుతుంది. ఇదిలావుంచితే, ఈ చిత్రం తర్వాత చిరంజీవి రెండు చిత్రాలను లైన్లో పెడుతున్నారు. వీటిలో ఒకటి మలయాళ చిత్రం 'లూసిఫర్' రీమేక్ కాగా, మరొకటి తమిళ చిత్రం 'వేదాళం' రీమేక్.  

కాగా, 'లూసిఫర్'కు వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా, 'వేదాళం'కు మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తారు. ఇక ఈ రెండింటిలోనూ ముందుగా లూసిఫర్ రీమేక్ మొదలవుతుందని అంటున్నారు. అందుకే, ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం ముమ్మరంగా జరుగుతున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం వినాయక్ ఆధ్వర్యంలో స్క్రిప్ట్ పని జోరుగా సాగుతోంది. మలయాళం చిత్రాన్ని మన నేటివిటీకి అనుగుణంగా మార్చే బాధ్యతను ప్రముఖ రచయిత ఆకుల శివకు మెగాస్టార్ అప్పగించినట్టు సమాచారం. చిరంజీవి ఇమేజ్ కు తగ్గట్టుగా బలమైన సన్నివేశాలను ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడట. గతంలో ఈయన వినాయక్ దర్శకత్వం వహించిన పలు చిత్రాలకు పనిచేశారు.

ఈ చిత్రం షూటింగును సంక్రాంతి వెళ్లాక ప్రారంభించడానికి మరోపక్క ఏర్పాట్లు చేస్తున్నారు. మలయాళం వెర్షన్లో మంజు వరియర్ పోషించిన కీలకమైన పాత్రకు రమ్యకృష్ణను పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు.