కొల్లాయి వస్త్రాలు ధరించే ఒక సగటు మనిషి బ్రిటీష్ సామ్రాజ్య దాస్యశృంఖలాలను ఎలా పటాపంచలు చేశాడు?: పవన్

01-10-2020 Thu 21:23
Pawan Kalyan messages on Gandhi Jayanti
  • రేపు గాంధీ జయంతి
  • భారతీయులకు పండుగ రోజన్న పవన్
  • గాంధీ మార్గం ఆచరణీయం అంటూ ప్రకటన

రేపు గాంధీ జయంతి (అక్టోబరు 2) సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా ఓ ప్రకటన వెలువరించారు. గాంధీజీ మార్గం సర్వదా ఆచరణీయం అని పేర్కొన్నారు. అక్టోబరు 2... మహాత్ముడు ఉదయించిన రోజు అని, భారతీయులంతా పండుగలా భావించే రోజని తెలిపారు. నా జీవితమే నా సందేశం అని చెప్పిన మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీజీ జీవితం కేవలం భారతీయులకే కాదని, ప్రపంచం మొత్తానికి ఒక గొప్ప జీవన మార్గం అని వివరించారు.

సాధారణ వ్యక్తి బాపుగా ప్రజల గుండెల్లో ఎలా గూడు కట్టుకున్నాడు? ఒక మామూలు మానవుడు మహాత్ముడిగా ఎలా కొనియాడబడ్డాడు? కొల్లాయి వస్త్రాలు ధరించే ఒక సగటు మనిషి బ్రిటీష్ సామ్రాజ్యపు దాస్యశృంఖలాలను ఎలా పటాపంచలు చేశాడు? అనే గాంధీజీ జీవితంలోని ఘట్టాలు నేటి యువతకు పాఠాలు వంటివని పేర్కొన్నారు.