క్యాబ్ డ్రైవర్ ను మోసం చేయాల్సిన అవసరం లేదు... నా క్యారెక్టర్ అందరికీ తెలుసు: ముమైత్ ఖాన్

01-10-2020 Thu 20:37
Mumaith Khan complains against cab drive who makes allegations
  • ముమైత్ పై క్యాబ్ డ్రైవర్ రాజు పోలీసులకు ఫిర్యాదు
  • తనను మోసం చేసిందని వెల్లడి
  • డ్రైవర్ పై పంజాగుట్ట పీఎస్ లో ఫిర్యాదు చేసిన ముమైత్

ఇటీవలే రాజు అనే క్యాబ్ డ్రైవర్ సినీ నటి ముమైత్ ఖాన్ తనను మోసం చేసిందంటూ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. గోవా వెళ్లేందుకు మూడ్రోజులకు క్యాబ్ బుక్ చేసుకున్న ముమైత్ తన ట్రిప్ ను 8 రోజులకు పొడిగించిందని తనకు రూ.15 వేల వరకు చెల్లించాల్సి ఉందని ఆరోపించాడు. టోల్ చార్జీలు కూడా తానే చెల్లించానని, డ్రైవర్ చార్జీలు కూడా ఇవ్వలేదని వివరించాడు.

ఈ వ్యవహారంలో స్పందించిన ముమైత్ ఖాన్ క్యాబ్ డ్రైవర్ రాజుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, గత రెండ్రోజులుగా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని, ఓ క్యాబ్ డ్రైవర్ ను మోసం చేయాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. పన్నెండేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నానని, తన క్యారెక్టర్ ఎలాంటిదో అందరికీ తెలుసని అన్నారు. తాను పక్కా ప్రొఫెషనల్ అని తెలిపారు.

వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా చానళ్లు తన పరువుకు నష్టం కలిగించే విధంగా వార్తలు ప్రసారం చేశాయని ముమైత్ ఆవేదన వ్యక్తం చేశారు. నా క్యారక్టర్ ను నిర్ణయించడానికి ఈ మీడియా చానళ్లకు ఏం హక్కుంది అని ప్రశ్నించారు. విమానాల్లో పెంపుడు జంతువులను అనుమతించకపోవడంతో క్యాబ్ లో గోవా వెళ్లానని, క్యాబ్ డ్రైవర్ కు రూ.23,500 చెల్లించానని వెల్లడించారు. కానీ డ్రైవర్ రాజు తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, తనను వేధించాడని ఆరోపించారు.