NCW: హత్రాస్ మృతురాలిని ఎందుకు హడావుడిగా దహనం చేశారు?: యూపీ డీజీపీని ప్రశ్నించిన జాతీయ మహిళా కమిషన్

  • సంచలనం సృష్టించిన హత్రాస్ ఘటన
  • మృతదేహాన్ని దహనం చేసిన పోలీసులు
  • పోలీసుల నుంచి వివరణ కోరిన జాతీయ మహిళా కమిషన్
NCW asks UP DGP on Hathras incident why they cremated victim in a hurry

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ యువతి అత్యంత దారుణ పరిస్థితుల్లో కన్నుమూసిన ఘటన దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతోంది. ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హింసించారంటూ ప్రచారం జరిగింది. అయితే ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ రిపోర్టు చెబుతోందని యూపీ పోలీసులు అంటున్నారు. కాగా, యువతి మృతదేహానికి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

దీనిపై జాతీయ మహిళా కమిషన్ యూపీ పోలీసులను ప్రశ్నించింది. మృతదేహాన్ని ఎందుకంత హుటాహుటీన దహనం చేయాల్సి వచ్చింది? అని ప్రశ్నిస్తూ యూపీ డీజీపీ హితేశ్ చంద్ర అవస్తికి మహిళా కమిషన్ లేఖ రాసింది. అది కూడా అర్ధరాత్రి వేళ, మృతురాలి కుటుంబ సభ్యులు లేకుండానే ఎందుకు అంతిమసంస్కారాలు జరిపారో వివరణ ఇవ్వాలని కోరింది. కాగా ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.

అటు, మృతురాలి కుటుంబ సభ్యులు ఈ ఘటనపై స్పందిస్తూ, అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ను అభ్యర్థించినా, పోలీసులు ముందుగానే ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దహనం చేశారని ఆరోపించారు.

More Telugu News