అటు కేంద్రం, ఇటు జగన్ సర్కారుపై గాల్లో కత్తి తిప్పుతూ జనరంజక విన్యాసం చేస్తున్నారు: సీఎం కేసీఆర్ పై రేవంత్ విసుర్లు

01-10-2020 Thu 19:06
Revanth Reddy writes CM KCR open letter on Irrigation issues
  • జల అంశాలపై కేసీఆర్ ను ప్రశ్నించిన రేవంత్
  • కేంద్ర నిర్ణయాలకు డూడూ బసవన్నలా తలూపుతున్నారంటూ వ్యాఖ్యలు
  • కేసీఆర్ రైతు ద్రోహిగా మిగిలిపోతారంటూ ఆగ్రహం
  • బహిరంగ లేఖ రాసిన రేవంత్

సీఎం కేసీఆర్ అంటే ఒంటికాలిపై లేచే కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. జల అంశాలపై సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు. ఏపీపై సీఎం కేసీఆర్ వి ఉత్తుత్తి గాండ్రింపులు, హూంకరింపులేనని విమర్శించారు. జగన్ సర్కారు కయ్యానికి కాలుదువ్వుతోందని ఓ వైపు ఆరోపిస్తూనే, మరోవైపు వారి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సాగునీటి కాంట్రాక్టుల విషయంలో వియ్యం కలుపుకుంటూనే ఉన్నారు కదా అని ఆరోపించారు.

 తెలంగాణ ప్రజల హక్కులు హరిస్తే ప్రతిఘటిస్తాం అని ప్రెస్ నోట్లలో గాండ్రించే మీరు వాస్తవానికి ఏంచేస్తున్నారు? అటు కేంద్రం, ఇటు ఏపీపై గాల్లో కత్తి తిప్పుతూ జనరంజక విన్యాసం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా మీ ఉత్తుత్తి గాండ్రింపులు పక్కనబెట్టి ఈ నెల 6న జరిగే అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజెండాలో నారాయణ్ పేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకం అంశాన్ని కూడా చేర్చేలా కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తక్షణమే వివరాలు పంపాలని డిమాండ్ చేశారు. లేకపోతే సీఎం కేసీఆర్ ఓ రైతు ద్రోహిగా మిగిలిపోతారని స్పష్టం చేశారు.

"కృష్ణా నదీ జలాల విషయంలో మీ వైఖరి... మబ్బుల్లో నీళ్లు చూసుకుని ముంత ఒలకబోసుకున్నట్టుగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే తెలంగాణ హక్కులుగా దఖలుపడిన ప్రాజెక్టులకు కొత్త ప్రాజెక్టులుగా ముద్రవేసి రీ ఇంజినీరింగ్ పేరుతో మీరు విన్యాసాలు చేస్తున్నారు. ఈ నిర్ణయాలు తెలంగాణ సాగునీటి ప్రయోజనాలకు తీవ్ర అడ్డంకిగా మారుతున్నాయి. దీన్ని అతి తెలివి అనాలా? లేక మూర్ఖత్వం అనాలా? ఓవైపు ఏపీ పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం ఎత్తిపోతల పేరుతో జలాల దోపిడీకి తెగబడితే మీరు ఉన్న హక్కులను కాపాడే బదులు వాటిని మరింత కాలరాస్తున్నారు.

ఇరు రాష్ట్రాల మధ్య జల కేటాయింపులు చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ 2014లోనే లేఖ రాసినా ఎలాంటి స్పందన లేదని మీరు వ్యాఖ్యానించినట్టు మీడియాలో చూశాను. ప్రాధాన్యత ఉన్న ఈ అంశంపై కేంద్రం ఇప్పటికీ పలకకపోయినా, బీజేపీ ప్రయోజనాల కోసం మీరు పలుకుతూనే ఉన్నారు. కేంద్రం నిర్ణయాలన్నింటికీ డూడూ బసవన్నలా తలూపుతూనే ఉన్నారు" అంటూ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.