Elon Musk: మా కుటుంబానికి కరోనా వ్యాక్సిన్ అవసరంలేదు: ఎలాన్ మస్క్

  • వ్యాక్సిన్ వచ్చినా తాము స్వీకరించబోమన్న మస్క్
  • వైరస్ లు రావడం సాధారణ విషయమని వెల్లడి
  • వాటికి భయపడడం అర్థరహితమని వ్యాఖ్యలు
Elon Musk says his family does not need corona vaccine

వినూత్న సాంకేతిక ఆవిష్కరణల సంస్థ టెస్లా వ్యవస్థాపకుడు, అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ తనకు, తన కుటుంబానికి కరోనా వ్యాక్సిన్ అక్కర్లేదంటున్నారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా గానీ, తమ కుటుంబ సభ్యుల్లో ఎవరూ ఆ వ్యాక్సిన్ తీసుకోబోమని స్పష్టం చేశారు. ప్రపంచంలో వైరస్ లు వ్యాపించడం సాధారణమైన విషయం అని, వాటిని భరించడం అంతకంటే మామూలు విషయం అని అన్నారు. వైరస్ లకు భయపడాల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు.

ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలాన్ మస్క్ కు కొత్త కాదు. కరోనా వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో ఆయన మాట్లాడుతూ, మాస్కులు వేసుకోవడం వల్ల వైరస్ సోకదని భావించడం అర్థరహితం అన్నారు. కరోనాను దూరం పెట్టేందుకు లాక్ డౌన్ విధించడం సరికాదని పేర్కొన్నారు.

ఈ వైరస్ తో ముప్పు ఉన్నవాళ్లను మాత్రమే ఇళ్లకు పరిమితం చేస్తే సరిపోయేదని, ప్రతి ఒక్కరిని ఇంట్లో నిర్బంధించడం మంచి ఆలోచన కాదని అభిప్రాయపడ్డారు. ఇక, కరోనాతో భారీ జననష్టం జరగడంపైనా వేదాంత ధోరణిలో బదులిచ్చారు. పుట్టినవాళ్లు ఎప్పుడో ఒకప్పుడు గిట్టక మానరని సెలవిచ్చారు.

More Telugu News