Ashwini Dutt: నిర్మాత అశ్వనీదత్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు

  • ల్యాండ్ పూలింగ్ లో 39 ఎకరాలు ఇచ్చిన అశ్వనీదత్
  • తన భూమికి 4 రెట్లు అధికంగా చెల్లించాలంటూ పిటిషన్
  • ప్రభుత్వ తీరుతో తమ భూముల విలువ పడిపోయిందని వ్యాఖ్య
AP HC take up Ashwini Dutts petition

సినీ నిర్మాత అశ్వనీదత్ వేసిన పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తన భూమికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై కోర్టు ఇరువైపు వాదనలను విన్నది. అయితే, ఈ కేసు డివిజన్ బెంచ్ ముందు కాకుండా, సింగిల్ జడ్జి ముందు పెట్టాలని ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో సంబంధిత పత్రాలను అందించాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఏపీ రాజధాని కోసం గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ కింద తాను 39 ఎకరాల భూమిని ఇచ్చానని.. అప్పట్లో ఎకరం భూమి రూ. 1.54 కోట్లుగా ఉందని తన పిటిషన్ లో అశ్వనీదత్ తెలిపారు. ఆ భూమికి సమానమైన విలువ కలిగిన భూమిని అమరావతిలో ఇస్తామని సీఆర్డీయే తనతో ఒప్పందం చేసుకుందని... ప్రస్తుత ప్రభుత్వం రాజధానిని వేరే చోటికి తరలించాలని భావిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడి భూమి ఎకరం రూ. 30 లక్షలు  కూడా చేయడం లేదని అన్నారు. భూసేకరణ కింద తన భూమికి 4 రెట్లు రూ. 210 కోట్లు చెల్లించిన తర్వాతే ప్రభుత్వం కానీ, ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కానీ నిర్మాణాలు చేపట్టుకోవాలని పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఈరోజు హైకోర్టు విచారణ చేపట్టింది.

More Telugu News