పోలీసులతో తోపులాటలో కిందపడిపోయిన రాహుల్ గాంధీ... పరామర్శించిన ప్రియాంక

01-10-2020 Thu 16:09
Rahul Gandhi fell down as Priyanka came to console her brother
  • హత్రాస్ బయల్దేరిన రాహుల్ గాంధీ
  • గ్రేటర్ నోయిడా వద్ద అడ్డుకున్న పోలీసులు
  • కాలినడకన వెళ్లేందుకు రాహుల్ ప్రయత్నం

హత్రాస్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నించగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. తన కాన్వాయ్ తో యూపీ బయల్దేరిన రాహుల్ గాంధీని పోలీసులు గ్రేటర్ నోయిడా వద్ద నిలిపివేశారు. దాంతో ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి కాలినడకన ముందుకు వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా యమున ఎక్స్ ప్రెస్ హైవేపై ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

హత్రాస్ జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, అక్కడికి వెళ్లడం మానుకోవాలని పోలీసులు రాహుల్ గాంధీకి సూచించారు. అయితే ఆయన ముందుకు వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో అక్కడ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. ఓ దశలో పోలీసులతో తోపులాటలో రాహుల్ గాంధీ కిందపడిపోయారు. ఇతర కాంగ్రెస్ నేతలు ఆయన పైకి లేచేందుకు సాయపడ్డారు. కిందపడిన అన్నను కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. తనను కూడా పోలీసులు నెట్టివేశారంటూ ఆమె ఆరోపించారు.