NHRC: హత్రాస్ ఘటనను సుమోటోగా స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్సీ

  • యువతిపై పాశవిక రీతిలో అత్యాచారం
  • తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ యువతి మృతి
  • యూపీ సర్కారు, డీజీపీకి నోటీసులు పంపిన ఎన్ హెచ్ఆర్సీ
NHRC has taken up Hatras incident as Sumoto case

సభ్యసమాజం తలదించుకునేలా జరిగిన హత్రాస్ ఘటనను జాతీయ మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గడ్డి కోసేందుకు తల్లి, సోదరుడితో పొలం వెళ్లిన ఆ అమ్మాయి ఆచూకీ లేకుండాపోయింది. తీవ్రగాయాలపాలైన స్థితిలో సెప్టెంబరు 22న ఆమెను గుర్తించారు.

ఆమెపై అఘాయిత్యానికి పాల్పడిన దుండగులు ఆ అభాగ్యురాలి నాలుక కోసేసి, నడుం విరగ్గొట్టి అత్యంత హేయంగా ప్రవర్తించిన వైనం అందరినీ కలచివేసింది. అత్యాచార బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడంతో ఆ కిరాతకులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎన్ హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసినట్టు ప్రకటించింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ యూపీ సర్కారుకు, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. కాగా, మృతురాలి అంత్యక్రియలు అర్ధరాత్రి దాటిన తర్వాత హుటాహుటీన జరిపించిన నేపథ్యంలో పోలీసుల తీరుపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

More Telugu News