డ్రగ్స్‌ కేసులో ముగ్గురు హీరోలంటూ వార్తలు.. 'ఏ', 'ఎస్‌', 'ఆర్‌' అంటూ క్లూలు.. స్పందించిన ఎన్సీబీ అధికారి

01-10-2020 Thu 12:08
ncb officer on drugcase
  • ఇప్పటికే దీపికను ప్రశ్నించిన అధికారులు
  • విచారణలో పలు విషయాలు వెల్లడి
  • ముగ్గురు హీరోలు కేసులో ఉన్నారన్న వార్తలను కొట్టేసిన అధికారి

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు డ్రగ్స్‌ కోణం గురించి తెలియడంతో ఇందులోనూ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌ భామలను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించగా పలు విషయాలు బయటపడ్డాయి. ఇటీవలే హీరోయిన్‌ దీపిక పదుకుణేను ఎన్సీబీ అధికారులు విచారించారు.  

ఈ కేసులో భాగంగా మరిన్ని విషయాలు రాబట్టేందుకు హీరోయన్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీపికతో కలిసి నటించిన ముగ్గురు హీరోలకు ఎన్సీబీ సమన్లు ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల నుంచి పలు వెబ్‌సైట్లలో ఇందుకు సంబంధించిన వార్తలు కనపడుతున్నాయి.

ఆ హీరోల పేర్లలోని మొదటి అక్షరాలు 'ఏ', 'ఎస్‌', 'ఆర్‌' అని చెబుతున్నాయి. అయితే, ఈ వార్తలను ఓ ఎన్సీబీ అధికారి కొట్టిపారేశారు.  కొన్ని మీడియా ఛానెళ్లు అవాస్తవాలను ప్రసారం చేస్తున్నాయని, వాటిపై తమను స్పందించమని కోరుతున్నారంటూ మీడియాపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.