ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు పొడిగింపు

01-10-2020 Thu 11:55
IT Returns Last Date Extended
  • మరో రెండు నెలల గడువు
  • ట్విట్టర్ లో పేర్కొన్న సీబీడీటీ
  • కరోనా కష్టాల కారణంగా దాఖలు చేయలేకపోయిన పన్ను చెల్లింపుదారులు
  • మరింత సమయం ఇచ్చిన సీబీడీటీ

2018-19 ఆర్థిక సంవత్సరపు ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాలని భావించి, కరోనా కారణంగా ఆగిపోయిన వారికి శుభవార్త. రిటర్నుల దాఖలుకు మరో రెండు నెలల అదనపు గడువును ఇస్తున్నట్టు సీబీడీటీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్) పేర్కొంది. కరోనా కారణంగా పలు రకాల అవరోధాలు ఏర్పడినందునే రిటర్నుల దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు అధికారులు వెల్లడించారు.

కాగా, రెండేళ్ల నాటి రిటర్నుల దాఖలుకు సమయాన్ని పొడిగించడం ఇది నాలుగో సారి కావడం గమనార్హం. వాస్తవానికి 2018-19 ఆర్థిక సంవత్సరం అసెస్ మెంట్ ఇయర్ 2019-20 అవుతుంది. 2020 మార్చి నెలాఖరు నాటికే ఈ ఐటీఆర్ దాఖలు చేయాల్సి వుంటుంది. వైరస్ వ్యాప్తి కారణంగా తొలుత దీన్ని జూన్ 30 వరకూ, ఆపై జూలై 31 వరకూ దాని తరువాత సెప్టెంబర్ 30 వరకూ పొడిగించారు. ఇప్పుడు నాలుగోసారి మరో రెండు నెలల అంటే నవంబర్ 30 వరకు అవకాశం కల్పించారు. అలాగే, 2019-20 ఆర్థిక సంవత్సరం (2020-21 అసెస్ మెంట్ ఇయర్) రిటర్నులు దాఖలును కూడ నవంబర్ 30 వరకు పొడిగించారు.

ఇదే సమయంలో 2018-19 ఆర్థిక సంవత్సరంలో తమ దృష్టికి వచ్చిన అధిక విలువైన లావాదేవీలను గుర్తించిన అధికారులు, పలువురికి ఎస్ఎంఎస్, ఈ-మెయిల్స్ ద్వారా సమాచారం పంపుతూ, వాటికి సంబంధించిన వివరాలను రిటర్నులలో పేర్కొనాలంటూ హెచ్చరిస్తోంది. లేకుంటే తగు చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.