ఈ నెలలో 14 రోజులు బ్యాంకుల మూసివేత... వివరాలివే!

01-10-2020 Thu 10:56
Only Half Working Days for Banks in October
  • పలు పర్వదినాలతో అక్టోబర్
  • సగం రోజులు మాత్రమే పనిచేయనున్న బ్యాంకులు
  • ఏటీఎంలు పనిచేస్తాయన్న బ్యాంకులు

అక్టోబర్ నెలలో 14 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఈ నెలలో 31 రోజులు ఉండటం, రెండు శనివారాలు, ఆదివారాలతో పాటు దసరా, మిలాద్ ఉన్ నబీ, మహాత్మా గాంధీ జయంతి, సర్దార్ పటేల్ జయంతి, చెల్లమ్ తదితర సెలవులు కూడా ఉన్నాయి. దీంతో మొత్తం మీద దాదాపు సగం రోజుల పాటు మాత్రమే బ్యాంకులు తెరచుకుని ఉంటాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన వెబ్ సైట్ లో వెలువరించిన సమాచారం మేరకు బ్యాంకులకు సెలవుల జాబితాలో గాంధీ జయంతి, దసరాకు రెండు రోజులు, మిలాద్ ఉన్ నబీ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో 4, 11, 18, 25 తేదీల్లో ఆదివారాలు, 10, 24 తేదీల్లో రెండు, నాలుగో శనివారాలు వచ్చాయి. దీంతో దాదాపు సంగం రోజుల పాటు బ్యాంకులు పనిచేసే పరిస్థితి లేదు.

అయితే చెల్లమ్, మిలాద్ ఉన్ నబీకి కొన్ని రాష్ట్రాల్లోనే బ్యాంకులు పనిచేయవు. ఆ రాష్ట్రాల్లో మాత్రం ఈ నెలలో 12 సెలవులు ఉన్నట్టు. ఇంకొన్ని రాష్ట్రాల్లో దసరాకు ముందు వచ్చే మహా సప్తమికి కూడా సెలవు వర్తించనుంది. (ఇది తెలంగాణలో బతుకమ్మ నిమజ్జనం) దీంతో ఆ రాష్ట్రాల్లో 15 రోజుల సెలవులు రానున్నాయి. తెలంగాణలో బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా బ్యాంకులకు సెలవుపై స్పష్టత లేదు.

కాగా, రెండు వరుస సెలవులు ఎప్పుడు వచ్చినా, ఏటీఎంలలో ముందుగానే డబ్బులు నింపి ఉంచుతామని పలు బ్యాంకుల యాజమాన్యాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే, చెక్కులకు సంబంధించిన లావాదేవీల ప్రాసెసింగ్ నిలిచిపోతుందని, ఇదే సమయంలో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ కు ఏ విధమైన అడ్డంకులు ఏర్పడబోవని వెల్లడించాయి. ఈ విషయాన్ని గమనించి, సెలవులను చూసుకుని కస్టమర్లు తమతమ లావాదేవీలను పూర్తి చేసుకోవాలని బ్యాంకులు సూచించాయి.