వెంటిలేషన్ పరికరాలతో కొవిడ్ ముప్పు అధికం

01-10-2020 Thu 09:54
heating gadgets can rise corona risk factor
  • కొవిడ్ బాధితుల ద్వారా గాల్లో కలిసే వైరస్‌లు
  • హీటింగ్ పరికరాల వల్ల అవి గాల్లోనే సంచారం
  • కేంబ్రిడ్జి యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడి

కరోనా వైరస్‌పై కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయ పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు ఇళ్లలో ఉపయోగించే వెంటిలేషన్ పరికరాల వల్ల కూడా వైరస్ ముప్పు అధికమని అధ్యయనంలో తేలింది.

ఉష్ణోగ్రతల నియంత్రణ కోసం చాలామంది ఇళ్లలో వెంటిలేషన్ పరికరాలను ఉపయోగిస్తుంటారు. కొవిడ్ బాధితులు వదిలే శ్వాస, మాట్లాడడం, తుమ్మడం, దగ్గడం, చీదడం ద్వారా విడుదలయ్యే నీటి తుంపర్లలోని వైరస్‌ను ఈ వెంటిలేషన్ పరికరాలు లాగేసుకుని గది మొత్తం వ్యాపించేలా చేస్తాయి. హీటింగ్ పరికరాల కారణంగా ఉష్ణోగ్రత పెరగడం వల్ల వైరస్‌లు నేలపై పడకుండా గాల్లోనే సంచరిస్తుంటాయి. ఫలితంగా ఇళ్లలో ఉండేవారికి ఇవి సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.