Corona Virus: 70 శాతం మంది కరోనా రోగుల నుంచి ఎవరికీ వ్యాప్తి చెందని వ్యాధి: తాజా అధ్యయనం

  • సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ రీసెర్చ్
  • కాంటాక్ట్ ట్రేసింగ్ డేటా సమీకరణ
  • పలితాలను వెల్లడించిన సైన్స్ మేగజైన్
Corona Spreading in Unique ways in India

ఇంట్లో ఒకరికి కరోనా సోకుతుంది. లక్షణాలు బయటకు వచ్చి, కరోనా టెస్టింగ్ చేయించుకుని, అది పాజిటివ్ వచ్చిన తరువాత, ఇంట్లోని మిగతా వారికి పరీక్షలు జరిపితే నెగటివ్ వస్తోంది. అంటే... వైరస్ సోకిన వ్యక్తితో మూడు నాలుగు రోజులు మామూలుగా కలిసి తిరిగినా, వైరస్ వ్యాపించడం లేదు. ఇండియాలో ఇప్పుడు ఇదే పరిస్థితి అంతటా కనిపిస్తోంది. కరోనా వైరస్ సోకిన వారిలో 70 శాతం మంది దాన్ని ఎవరికీ వ్యాపింపచేయడం లేదని, కొద్దిమంది మాత్రమే వైరస్ ను ఇతరులకు అంటిస్తున్నారని తాజా అధ్యయనం వెల్లడించింది.

సార్స్ - సీఓవీ2 వ్యాప్తిపై దేశవ్యాప్తంగా సర్వే జరిగింది. వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్ సంస్థ డైరెక్టర్ రమణన్ లక్ష్మీనారాయణన్ నేతృత్వంలోని రీసెర్చర్ల బృందం, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ డేటాను సమీకరించింది. ఆగస్టు నాటికి తమిళనాడు, ఏపీల్లో 4.35 లక్షలకు పైగా కేసులు ఉన్నాయి. వీరందరినీ కాంటాక్ట్ అయిన దాదాపు 30 లక్షల మందిని రీసెర్చర్లు పరిశీలించారు. వీరిలో అత్యధికులకు వైరస్ సోకలేదని నిర్ధారించారు. ఇండియాలో వినూత్న మార్గాల్లో వైరస్ వ్యాపిస్తోందని తెలిపారు.

అయితే, మిగతా రాష్ట్రాల్లో పరిస్థితిపై మాత్రం పూర్తి గణాంకాలను రీసెర్చర్లు సమీకరించలేదు. మొత్తం 84,965 మంది వైరస్ సోకిన వారిని, వారితో కాంటాక్ట్ అయిన 5.75 లక్షల మందికి పైగా ప్రజల ల్యాబ్ రిజల్ట్స్, ఎపిడెమోలాజికల్ సమాచారాన్ని క్రోఢీకరించామని ఈ సందర్భంగా లక్ష్మీనారాయణన్ తెలిపారు. ఈ అధ్యయనం ఫలితాలు సెప్టెంబర్ 30 నాటి సైన్స్ మేగజైన్ లో ప్రచురితం అయ్యాయి.

More Telugu News