హత్రాస్ రేప్ నిందితులు ఎన్ కౌంటర్ కాబోతున్నారంటూ.. సంకేతాలిస్తూ బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో!

01-10-2020 Thu 08:48
BJP Leader Comments on Hartas Accused Encounter Demand
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కైలాష్ విజయ్ వర్గియా
  • యూపీకి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అని గుర్తుంచుకోండి
  • ఆయన పాలనలో ఓ కారు ఎప్పుడైనా బోల్తా పడవచ్చని వ్యాఖ్య

ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో జరిగిన అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతున్న వేళ, బాధితురాలికి న్యాయం చేయాలన్న డిమాండ్ వెల్లువెత్తుండగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా నిందితులను ఎన్ కౌంటర్ చేయవచ్చన్న సంకేతాలిస్తూ, మాట్లాడిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బాధితురాలికి న్యాయం జరగాలంటే, నిందితుల ఎన్ కౌంటర్ ఒక్కటే మార్గమని ప్రజలు అభిప్రాయపడుతున్న సమయంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఈ దారుణ ఘటనపై స్పందించిన కైలాష్ విజయ్ వర్గియా, "నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణను ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు కూడా అప్పగించారు. ఈ రాష్ట్రానికి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రని గుర్తుంచుకోండి. ఆయన పాలనలో ఓ కారు ఎప్పుడైనా, ఎక్కడైనా బోల్తా పడగలదన్న సంగతి నాకు తెలుసు" అంటూ ఎన్ కౌంటర్ జరిగే చాన్స్ ఉందన్న హింట్ ఇచ్చారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.