ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి ప్రొఫెసర్ కె.నాగేశ్వర్.. స్వయంగా ప్రకటన

01-10-2020 Thu 06:58
prof k nageshwar rao ready to fight in MLC Elections Held in next year
  • మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలోకి
  • 2007, 2009లలో ఇదే నియోజకవర్గం నుంచి రెండుసార్లు గెలుపు
  • ఓటరు నమోదుకు నేటి నుంచి దరఖాస్తుల స్వీకారం

వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పోటీ చేయనున్నారు.  ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. తనకు అనేక సంఘాల మద్దతు ఉన్నట్టు తెలిపారు. తన గురించి ప్రధాన మీడియాతోపాటు సోషల్ మీడియాలోనూ వార్తలు వస్తుండడంతో వాటికి చెక్ చెప్పేందుకే ఈ ప్రకటన చేసినట్టు వివరించారు.

2007, 2009లలో ఇదే నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన ఆయన 2014 వరకు మండలికి ప్రాతినిధ్యం వహించారు. కాగా, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. వచ్చే నెల ఆరో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. www.ceotelangana.nic.in లోనూ నమోదు చేసుకోవచ్చని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి పంకజ తెలిపారు.