వెబ్ సీరీస్ కోసం రానాతో జతకట్టిన శ్రుతిహాసన్!

30-09-2020 Wed 20:45
Shruti Hassan romance with Rana Daggubati
  • వెబ్ సీరీస్ పట్ల ఆసక్తి చూపుతున్న తారలు 
  • నలుగురి దర్శకత్వంలో నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్ 
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎపిసోడ్ పూర్తి  

వెబ్ సీరీస్... ఇటీవలి కాలంలో బాగా పాప్యులర్ అయిపోయిన పదమిది. ఓటీటీ ప్లాట్ ఫామ్ నుంచి పారితోషికం పరంగా మంచి ఆఫర్లు వస్తుండడంతో చాలామంది కథానాయికలు వీటిలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కొంతమంది ప్రముఖ హీరోయిన్లు వెబ్ సీరీస్ లో నటిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అందాలతార శ్రుతిహాసన్ కూడా ఓ వెబ్ సీరీస్ లో నటిస్తోంది.

ప్రముఖ ఓటీటీ ప్లేయర్ నెట్ ఫ్లిక్స్ కోసం రూపొందుతున్న ఈ వెబ్ సీరీస్ లో శ్రుతిహాసన్ తో పాటు హీరో రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నట్టు తాజా సమాచారం. విశేషం ఏమిటంటే, ఈ వెబ్ సీరీస్ కి నలుగురు దర్శకులు దర్శకత్వం వహిస్తారట. వీరిలో ముందుగా 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ తొలి ఎపిసోడ్ కి దర్శకత్వం వహించినట్టు చెబుతున్నారు. ప్రభాస్ తో చేయనున్న 'ఆదిపురుష్' సినిమా ప్రారంభానికి ఇంకా సమయం ఉండడంతో ఈలోగా ఆయన ఈ ప్రాజక్టును పూర్తి  చేసినట్టు తెలుస్తోంది.