విమానాశ్రయం నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయా: మీనా

30-09-2020 Wed 19:07
PPE Kits are very uncomfortable says Actress Meena
  • ఏడు నెలల తర్వాత విమాన ప్రయాణం చేశాను
  • పీపీఈ కిట్లు ధరించడం చాలా అసౌకర్యంగా ఉంది
  • చల్లటి వాతావరణంలో కూడా చెమటలు పట్టాయి

ప్రముఖ సినీనటి మీనా దాదాపు ఏడు నెలల తర్వాత విమాన ప్రయాణం చేశారు. కరోనా కారణంగా షూటింగులు లేకపోవడంతో ఆమె ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్లీ నెమ్మదిగా షూటింగులు ప్రారంభమవుతున్నాయి. దీంతో 'దృశ్యం2' షూటింగ్ లో పాల్గొనడానికి చెన్నై నుంచి కేరళకు ఆమె వెళ్లారు. పీపీఈ కిట్ ధరించి ఆమె ప్రయాణించారు. తన ప్రయాణానికి సంబంధించిన అనుభవాలు, ఫొటోలను అభిమానులతో ఆమె పంచుకున్నారు.

పీపీఈ కిట్లతో ఏదో యుద్ధానికి వెళ్తున్న భావన తనకు కలిగిందని మీనా చెప్పింది. ఏడు నెలల తర్వాత ప్రయాణం చేశానని... విమానాశ్రయ పరిసరాలన్నీ వెలవెలబోయి ఉన్నాయని, పరిసరాలు నిశ్శబ్దంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. అయితే చాలా మంది తనలా పీపీఈ కిట్లు ధరించకుండానే వచ్చారని చెప్పారు. అయితే ఈ కిట్లను ధరించడం చాలా అసౌకర్యంగా ఉందని... ఉక్కపోతగా, చికాకుగా అనిపించిందని అన్నారు. చల్లటి వాతావరణం ఉన్నా చెమటలు పట్టాయని.. చేతికి గ్లౌజులు ధరించడం వల్ల ముఖానికి పట్టిన చెమటను కూడా తుడుచుకోలేని పరిస్థితని చెప్పారు.