CPI Narayana: కేంద్రానికి సహకరించకపోతే జగన్ మళ్లీ జైలుకెళ్తారు.. మరి చంద్రబాబుకు ఆ భయమెందుకు?: సీపీఐ నారాయణ

  • జైలుకి వెళ్లడం వల్లే జగన్ సీఎం అయ్యారు
  • వైసీపీ, టీడీపీ కేంద్రం ముందు మోకరిల్లుతున్నాయి
  • వైయస్ పథకానికి జగన్ మంగళం పలుకుతున్నారు
CPI Narayana challenges Jagan

జైలుకు వెళ్లడం వల్లే వైసీపీ అధినేత జగన్ సీఎం అయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. అలాంటప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు భయమెందుకని... జైలుకెళ్తే ఆయనకే మంచిదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను దేశంలోని ఆరేడు రాష్ట్రాలు వ్యతిరేకించాయని... కానీ ఏపీలోని అధికార, విపక్షాలు రెండూ కేంద్రం ముందు మోకరిల్లాయని ఎద్దేవా చేశారు. కేంద్రానికి జగన్ మద్దతివ్వక తప్పని పరిస్థితి ఉందని.. కేంద్రానికి సహకరించకపోతే జగన్ మళ్లీ జైలుకెళ్తారని చెప్పారు. చంద్రబాబుకు ఆ భయమెందుకని ప్రశ్నించారు.

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ విశాఖలో వామపక్షాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ చట్టాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినవారంతా హీరోలేనని అన్నారు. కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు ముందుకు సాగాలని... ఈ క్రమంలో జైలుకెళ్తే ఆయనకే లాభమని చెప్పారు.

కొత్త వ్యవసాయ చట్టాలు రైతులను నరహంతకుల్లా చేసే అవకాశం ఉందని నారాయణ అన్నారు. రాజశేఖర్ రెడ్డి  సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత విద్యుత్ కల్పించారని... ఇప్పుడు ఆయన కొడుకే దానికి మంగళం పాడుతున్నారని విమర్శించారు. వ్యవసాయ పంపులకు మీటర్లు బిగించేందుకు వచ్చేవాడి చేతులు మిగలవని హెచ్చరించారు. జగన్ కు దమ్ముంటే విద్యుత్ మీటర్లు బిగించాలని సవాల్ విసిరారు. తేనెపూసిన కత్తిలా ఏపీని మోదీ మోసం చేస్తున్నారని అన్నారు.

More Telugu News