అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల కేసు.. పోలీసుల సమన్లు!

30-09-2020 Wed 15:45
Police sends summons to director Anurag Kashyap
  • లైంగికంగా వేధించాడంటూ అనురాగ్ కశ్యప్ పై పాయల్ కేసు
  • త్వరగా దర్యాప్తు చేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని హెచ్చరిక
  • పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై నటి పాయల్ ఘోష్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తనను రూమ్ కి పిలిచి, అసభ్యంగా ప్రవర్తించాడని, తన దుస్తులను తొలగించే ప్రయత్నం చేశాడని ఫిర్యాదులో తెలిపింది. తాను పిలిస్తే హీరోయిన్లు వచ్చి గడుపుతారని చెప్పాడని పేర్కొంది. ఈ నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 354, 341, 342 కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, కేసుపై త్వరగా దర్యాప్తు చేయకపోతే తాను నిరాహారదీక్ష చేస్తానని పాయల్ ఘోష్ హెచ్చరించింది. అంతేకాదు, తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. దీనికితోడు, నిన్న మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలిసి ఇదే విషయంపై ఫిర్యాదు చేసింది. వీటన్నింటి నేపథ్యంలో అనురాగ్ కశ్యప్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆయనను విచారించబోతున్నారు.