బాలకృష్ణ తాజా చిత్రంలో సోనూసూద్!

30-09-2020 Wed 14:32
Sonu sood to act in Balakrishnas latest flick
  • నిజజీవిత హీరో అనిపించుకున్న సోనూ
  • 'అల్లుడు అదుర్స్' సినిమాలో కీలక పాత్ర
  • బోయపాటి, బాలయ్య సినిమాలో విలన్    
  • త్వరలో షూటింగ్ మొదలయ్యే అవకాశం 

సినిమాలలో విలన్ పాత్రలు పోషించే సోనూసూద్ ఇటీవల నిజజీవితంలో మాత్రం హీరో అయిపోయాడు. ఆమధ్య కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా అష్టకష్టాలు పడ్డ వలస కార్మికులను సోనూ ఎంతగానో ఆదుకున్నాడు. నగరాలకొచ్చి కాయకష్టం చేసుకుంటూ జీవిస్తున్న వలస కార్మికులు దిక్కుతోచని స్థితిలో వున్నప్పుడు వాళ్లకు ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించి వారిని స్వస్థలాలకు జేర్చి, వాళ్ల పాలిట రియల్ హీరో అయ్యాడు. దీంతో ఆయన ఇమేజ్ ఇప్పుడు మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో సినిమాలలో కూడా ఆయనకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

ఈ క్రమంలో బాలకృష్ణ నటించే చిత్రంలో విలన్ పాత్ర పోషించే అవకాశం ఇప్పుడు సోనూ సూద్ కు వచ్చినట్టు తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో సోనూను విలన్ పాత్రకు ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ చిత్రం తదుపరి షూటింగ్ త్వరలో హైదరాబాదులో మొదలవుతుంది.

మరోపక్క, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న 'అల్లుడు అదుర్స్' చిత్రంలో కూడా సోనూసూద్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం కోసం ఆయన హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీలో వున్నాడు.