అత్యాచార నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి: యోగికి మోదీ ఫోన్

30-09-2020 Wed 13:46
Modi telephoned Yogi on Hatras incident
  • యూపీలో యువతిపై దారుణ అత్యాచారం
  • ఢిల్లీలో చికిత్స పొందుతూ యువతి మృతి
  • ఎవరినీ వదలొద్దన్న మోదీ

యూపీలోని హత్రాస్ లో ఓ యువతిని నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా హింసిస్తూ, సామూహిక అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె నాలుకను కోసేశారు. ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మరోవైపు ఆమె శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయి. శరీరంలోని పలు అవయవాలు పని చేయని స్థితిలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘటన దేశ వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలను రగిల్చింది. ఈ నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రధాని మోదీ ఈ రోజు ఫోన్ చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగిని ఆదేశించారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దని అన్నారు.

మోదీ ఫోన్ చేసిన విషయాన్ని యోగి వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధాని ఆదేశించారని చెప్పారు. దీనిపై ముగ్గురు అధికారులతో ఓ ప్యానెల్ ఏర్పాటు చేశామని... వారం రోజుల్లో ఈ ప్యానెల్ రిపోర్టు సమర్పిస్తుందని తెలిపారు.