ఇలాగైతే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు: ఏపీ అప్పులపై ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యలు

30-09-2020 Wed 13:04
iyr slams ap govt
  • ఏడాది కాలంలో చేయాల్సిన అప్పును 5 నెలల్లోనే చేశారు
  • ఏదో అయిదు పది శాతం అటూ ఇటూ అయితే సర్దవచ్చు  
  • అప్పు చేసి పంచడమే పాలనా? 
  • అప్పు పుట్టటమే గగనం అయ్యే రోజు దూరంలో లేదు

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాది కాలంలో చేయాల్సిన అప్పును 5 నెలల్లోనే చేశారని కాగ్‌ నివేదికలో వచ్చిన వివరాలను ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనాన్ని పోస్ట్ చేస్తూ ఏపీ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వ రూపాయి ఖర్చులో 55 పైసలు రుణంతో వచ్చినవేనని, ఇప్పటికే రూ.38,199 కోట్ల రెవెన్యూ లోటు ఉందని అందులో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కారు గత ఐదు నెలల్లో వివిధ రూపాల్లో రూ. 84,617.23 కోట్లు సమీకరించిందని, అయితే, వాటిలో రూ. 47,130.90 కోట్ల రుణాలు ఉన్నాయని, సమీకరించిన మొత్తంలో 55.7 శాతం రుణమేనని అందులో పేర్కొన్నారు. వీటిపైనే ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు. 

'ఏదో అయిదు పది శాతం అటూ ఇటూ అయితే సర్దవచ్చు కానీ ఏకంగా వంద శాతం ఎక్కువ అప్పు చేయాల్సి నట్లయితే ఎవరూ కాపాడలేరు. అప్పు చేసి పంచడమే పాలన అయినప్పుడు అప్పు పుట్టటమే గగనం అయ్యే రోజు దూరంలో లేదు' అని ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.