Babri Demolition case: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో తుది తీర్పు వెల్లడి.. అద్వానీ సహా నిందితులందరూ నిర్దోషులే!

  • దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం తీర్పు
  • నిందితులుగా ఉన్న బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్‌
  • చాలా మంది సంఘ్ ‌పరివార్‌ నేతలు నిందితులే
  • అభియోగాలు నిరూపించలేకపోయిన సీబీఐ
Babri Demolition Case All Accused Including LK Advani Acquitted

దాదాపు 28 సంవత్సరాల సుదీర్ఘ విచారణ అనంతరం బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ రోజు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా బీజేపీ నేతలు ఎల్కే ఆద్వానీ, మురళీ మనోహర్‌ జోషితో పాటు సంఘ్ ‌పరివార్‌ నేతలు చాలా మంది ఉన్న విషయం తెలిసిందే.

అయితే, నిందితులపై సీబీఐ అభియోగాలు నిరూపించలేకపోయిందని కోర్టు పేర్కొంది. దీంతో నిందితులు అందరిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. నిందితులు ఎవరూ నేరపూరిత కుట్రకు పాల్పడ్డారన్న ఆధారాలు లేవని, దాంతో వారంతా నిర్దోషులేనని స్పష్టం చేసింది.

కాగా, తీర్పు సమయంలో నిందితులంతా కోర్టులో హాజరు కావాలని జడ్జి ఆదేశించగా 11 మంది హాజరుకాలేదు. ఈ కేసులో మొత్తం 49 మంది నిందితులు ఉన్నారు. వారిలో విచారణ సమయంలో 17 మంది మృతి చెందారు. తీర్పు వెల్లడించనంత వరకు 32 మంది నిందితులుగా ఉన్నారు. వారిలో 21 మంది నిందితులు కోర్టుకు హాజరయ్యారు. వారు కోర్టుకు వచ్చిన నేపథ్యంలో లక్నోలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నిందితుల్లో అద్వానీ, మురళీ మనోహర్‌ జోషితో పాటు యూపీ‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, సాధ్వి రితంబర, వినయ్‌ కటియార్‌, పవన్‌ పాండే, సుధీర్‌ కక్కర్ వంటి వారు కూడా ఉన్నారు.

కాగా, 1992 డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చివేసిన విషయం తెలిసిందే. అద్వానీ, మురళీమనోహర్‌ జోషి వంటి బీజేపీ నేతలతో పాటు సంఘ్‌పరివార్‌ నేతలు ప్రజలను రెచ్చగొట్టడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపణలు వచ్చాయి. అనంతరం సీబీఐ ఈ కేసులో విచారణ జరిపింది. అయితే, కొన్నేళ్ల కింద పలువురు నేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను సీబీఐ న్యాయస్థానం తొలగించింది. ఆ తర్వాత మళ్లీ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆ అభియోగాలను కొనసాగించారు.

More Telugu News