హిందూ దేవాలయాలపై దాడుల నేపథ్యంలో హోమం చేస్తున్నాం: శ్రీనివాసానంద

30-09-2020 Wed 11:44
srinivasananda on attacks on temples in ap
  • కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం 
  • ఈ తీరు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచిది కాదు
  • ఆలయాలను మనం కాపాడాలి
  • అవి మనల్ని కాపాడతాయి

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై జరుగుతోన్న దాడుల పట్ల  ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన ఆధ్వర్యంలో కాసేపట్లో శాంతి యజ్ఞం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని నెలలుగా హిందూ దేవాలయాల్లో అపచారం జరుగుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరు దేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు మంచిది కాదని ఆయన చెప్పారు.

ఈ ఘటనపై దేవాలయ ధర్మాదాయ శాఖ అరిష్ట నివారణ శాంతి హోమాలు చేయాలని, అయితే ఈ పని చేయట్లేదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తామే ఈ హోమం చేస్తున్నామని వివరించారు. ఆలయాలను మనం కాపాడితే అవి మనల్ని కాపాడతాయని చెప్పుకొచ్చారు. ఆలయాలపై దాడులకు పాల్పడుతున్న వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దాడులు జరుగుతున్నప్పటికీ ఆ విషయాలపై స్పందించకుండా మౌనం వహిస్తోన్న ప్రజాప్రతినిధులకు దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు.