Donald Trump: కుమార్తెను ఉపాధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలనుకున్న ట్రంప్.. ఆసక్తికర విషయం వెలుగులోకి!

  • రిక్‌గేట్స్ రాసిన ‘విక్డ్ గేమ్స్’ పుస్తకంలో ఆసక్తికర విషయాలు
  • తన ఎంపిక సరైన నిర్ణయం కాదని వారించిన ఇవాంక
  • ఆ వార్తలు నిజం కాదన్న ట్రంప్ అధికార ప్రతినిధి
Trump suggested Ivanka as his running mate in 2016

అందం, తెలివితేటలు, చలాకీతనం కలగలిసిన తన కుమార్తె ఇవాంకను అమెరికా ఉపాధ్యక్షురాలిని చేయాలని ట్రంప్ భావించారట. అయితే, అది మంచి నిర్ణయం కాదని ఇవాంక చెప్పడంతో ట్రంప్ ఆ ఆలోచన విరమించుకున్నారట. 2016లో ట్రంప్ ఎన్నికల ప్రచార వ్యవహారాలను చూసుకున్న రిక్ గేట్స్ రాసిన ‘విక్డ్ గేమ్’ పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉన్నట్టు తెలుస్తోంది. అక్టోబరు 13న ఈ పుస్తకం ప్రచురితం కాబోతోంది.

ఇవాంకకు కావాల్సినంత తెలివి, చలాకీతనంతోపాటు అందం కూడా ఉందని, ప్రజలు కూడా ఆమెను ఇష్టపడతారని, కాబట్టి ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని 2016 ఎన్నికల బరిలో ఉన్న ట్రంప్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు రిక్ గేట్స్ ఆ పుస్తకంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అప్పటి ఇండియానా గవర్నర్ మైక్ పెన్స్‌ను కూడా ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయాలని ట్రంప్ భావించినట్టు పుస్తకంలో గేట్స్ రాసుకొచ్చారు. అయితే, ఇవాంక ఆ నిర్ణయాన్ని సున్నితంగా  వ్యతిరేకించడంతో ట్రంప్ వెనక్కి తగ్గారట.

ఇవాంకను ఉపాధ్యక్ష పీఠంపై ట్రంప్ కూర్చోబెట్టాలని చూశారని వస్తున్న వార్తలను ట్రంప్ అధికార ప్రతినిధి కొట్టిపడేశారు. ఈ వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. కాగా, ట్రంప్ అధ్యక్షుడయ్యాక ఇవాంక తన తండ్రికి సీనియర్ సలహాదారుగా నియమితులయ్యారు.

More Telugu News