ప్రత్యేకంగా నాకు మరాఠీలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కల్యాణ్ గారూ!: సునీల్ దేవధర్

29-09-2020 Tue 21:13
  • నేడు సునీల్ దేవధర్ పుట్టినరోజు
  • సునీల్ దేవధర్ పై పవన్ ప్రశంసలు
  • బంగారు ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దామంటూ బదులిచ్చిన దేవధర్
Sunil Deodhar feels happy for Pawan Kalyan convey his wishes in Marathi

ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. మీ సాహసోపేత స్వభావం, నాయకత్వ పటిమ ప్రజలను చైతన్యపరుస్తాయని, ఇక్కడి ప్రజలకు చేరువయ్యేందుకు తెలుగు నేర్చుకోవాలన్న మీ అభిరుచి, మీరు తీసుకున్న బాధ్యత పట్ల మీ అంకిత భావం మీ నిబద్ధతను చాటుతాయంటూ పవన్ కొనియాడారు. ఈ సందేశాన్ని పవన్ తెలుగులోనూ, మరాఠీలోనూ ట్వీట్ చేశారు. దీనిపై సునీల్ దేవధర్ వినమ్రంగా బదులిచ్చారు. తన మాతృభాష మరాఠీలో పవన్ విషెస్ చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రత్యేకంగా నాకు మరాఠీలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు పవన్ కల్యాణ్ గారూ! అంటూ ట్విట్టర్ లో స్పందించారు. మనందరం కలిసి ఏపీని పట్టిపీడిస్తున్న కుల, కుటుంబ, అవినీతి రాజకీయాలను శాశ్వతంగా నిర్మూలించి బంగారు ఆంధ్రప్రదేశ్ ను నిర్మిద్దాం అంటూ వ్యాఖ్యానించారు.