మెహబూబ్ కు నాకంటే తక్కువ ఓట్లు వచ్చాయని విన్నాను... నన్నెలా ఎలిమినేట్ చేశారో అర్థం కావడంలేదు: దేవి నాగవల్లి

29-09-2020 Tue 20:27
Devi Nagavalli talked about her elimination from Bigg Boss show
  • బిగ్ బాస్ షో నుంచి దేవి నాగవల్లి ఎలిమినేషన్ 
  • తనకు ఎక్కువ ఓట్లు వచ్చినట్టు తెలిసిందన్న దేవి
  • బిగ్ బాస్ షోను నమ్మి వెళ్లానని వెల్లడి

బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయిన న్యూస్ యాంకర్ దేవి నాగవల్లి మీడియా ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న బలమైన కంటెస్టెంట్లలో దేవి ఒకరని అందరూ అనుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఆమెను ఎలిమినేట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని స్వయంగా దేవి నాగవల్లి ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బిగ్ బాస్ షోను నమ్మి వెళ్లానని, కానీ, తనకు ఓట్లు తక్కువగా వచ్చాయని చెప్పి ఎలిమినేట్ చేశారని వెల్లడించారు. "బయటికి వచ్చిన తర్వాత నాకు చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయని చాలామంది అంటున్నారు. మరి నాకంటే తక్కువ ఓట్లు వచ్చినవారిని వదిలేసి నన్ను ఎలిమినేట్ చేయడం నిర్ఘాంతపరిచింది. మెహబూబ్ కు నాకంటే తక్కువ ఓట్లు వచ్చాయని తెలిసింది. మరి నన్నెలా ఎలిమినేట్ చేస్తారు? నా వల్ల బిగ్ బాస్ షో స్క్రిప్టు మారిపోతోందని వాళ్లు భావించి ఉండొచ్చు. వాళ్లు అనుకున్న గేమ్ రావడంలేదు కాబట్టే నన్ను పంపించేశారని అనుకుంటున్నా" అని వివరించారు.