Peddireddi Ramachandra Reddy: ప్రతాపరెడ్డి వైసీపీకి చెందినవాడని తేలితే నేను రాజకీయాలు మానుకుంటా: పెద్దిరెడ్డి

  • బి.కొత్తకోటలో జడ్జి సోదరుడిపై దాడి
  • వైసీపీ వాళ్లే దాడి చేశారంటున్న టీడీపీ నేతలు
  • చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తున్నారన్న పెద్దిరెడ్డి
Peddireddy says if Pratapareddy belonged to YCP then he would quit politics

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడిచేసిన ప్రతాపరెడ్డి టీడీపీకి చెందినవాడని పోలీసులు వెల్లడించడం తెలిసిందే. టీడీపీ నేతలు మాత్రం ఈ దాడికి పాల్పడింది వైసీపీ వాళ్లేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. జడ్జి సోదరుడిపై దాడి జరిగితే దాన్ని వైసీపీకి ఆపాదించాలని చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు.

వాస్తవాలు తెలియకుండా లోకేశ్ ట్వీట్లు చేస్తుంటాడని, వాస్తవాలు తెలియకుండా చంద్రబాబు ఆరోపణలు చేస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతాపరెడ్డి గనుక వైసీపీ వాడని తేలితే తాను రాజకీయాల నుంచి వైదొలగుతానని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. ప్రతాపరెడ్డి టీడీపీకి చెందినవాడేనని తేలిందని, రామకృష్ణ వెనుక టీడీపీ ఉందని తెలుస్తోందని అన్నారు. దళితులు, మైనారిటీలపై గౌరవంలేని చంద్రబాబుకు, ఇప్పుడు అధికారం లేకపోయే సరికి వారిపై గౌరవం పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు.

విపక్ష నేత చంద్రబాబు కుట్రరాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. సస్పెండైన జడ్జిని అడ్డంపెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని అన్నారు. "రామకృష్ణ సోదరుడు మార్కెట్ వద్ద కారు అడ్డంపెడితే అక్కడ గొడవ జరిగింది. పోలీసుల విచారణలో ఆ గొడవతో మా కుటుంబానికి సంబంధం లేదని తేలింది. కానీ మా కుటుంబంపై ఆరోపణలు చేశారు. ఇప్పుడా దాడికి టీడీపీకి చెందిన ప్రతాపరెడ్డి కారణమని తేలింది. దీనిపై డీజీపీ కూడా చంద్రబాబుకు లేఖ రాశారు" అని తెలిపారు.

More Telugu News