అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్... మండల యాత్రలకు కేరళ సర్కారు గ్రీన్ సిగ్నల్

29-09-2020 Tue 19:36
Kerala government gives nod for Ayyappa yatras
  • నవంబరు 16 నుంచి అయ్యప్ప మండల యాత్రలు
  • గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్
  • కరోనా నేపథ్యంలో నిబంధనలు అమలు చేయాలని ఆదేశాలు

ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా లక్షల మంది భక్తులు అయ్యప్ప దీక్షలు స్వీకరించి శబరిమల యాత్రలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా ప్రభావంతో దీక్షలకు అనుమతి ఇచ్చే విషయంపై అనిశ్చితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పింది. నవంబరు 16 నుంచి మండల యాత్రలు షురూ అవుతాయని వెల్లడించింది. ఈ మేరకు అనుమతి ఇచ్చింది.

అయ్యప్ప మండల యాత్రలపై సీఎం పినరయి విజయన్ సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులకు, ట్రావెన్ కూర్ ట్రస్ట్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, రెండు నెలల పాటు సాగే ఈ యాత్రల సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సీఎం పినరయి విజయన్ అధికారులకు స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి కొనసాగుతున్నందున నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు.

ఈసారి అయ్యప్ప మండల యాత్రల్లో పాల్గొనాలనుకునే భక్తులు ముందుగా వర్చువల్ విధానంలో తమ పేర్లు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. పేర్లు రిజిస్టర్ చేయించుకున్నవారినే ఆలయంలోకి అనుమతిస్తారు. అంతేకాదు, వైరస్ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి భక్తులకు పంబా నదిలో స్నానం చేసేందుకు అనుమతి ఇవ్వడంలేదు. నదీ స్నానానికి బదులుగా పంబా, ఎరుమేలి ప్రాంతాల్లో షవర్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేయనున్నారు. భక్తులకు మాస్కు తప్పనిసరి చేశారు.