ఐపీఎల్ 2020: టాస్ గెలిచి సన్ రైజర్స్ కు బ్యాటింగ్ అప్పగించిన ఢిల్లీ

29-09-2020 Tue 19:21
Delhi Capitals choose fielding first against Sunrisers Hyderabad
  • అబుదాబిలో మ్యాచ్
  • పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఢిల్లీ
  • రెండు ఓటములతో చివరిస్థానంలో ఉన్న హైదరాబాద్

ఆడిన రెండు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైన సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పోరుకు సిద్ధమైంది. అబుదాబిలోని షేక్ జయేద్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

కాగా, ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో కేన్ విలియమ్సన్ కు స్థానం కల్పించారు. గత రెండు మ్యాచ్ లలో బ్యాటింగ్ వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించడంతో ఈసారి ఆ లోటు కనిపించనివ్వకుండా చేసేందుకు టాపార్డర్ ను బలోపేతం చేశారు.

ఇక ఢిల్లీ జట్టు ఆడిన రెండు మ్యాచ్ లలో నెగ్గి టేబుల్ టాపర్ గా నిలిచింది. అదే సమయంలో రెండు మ్యాచ్ లలోనూ ఓడిన సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో చివరన నిలిచింది. ఇప్పుడీ రెండు జట్లు తలపడనున్న నేపథ్యంలో సహజంగానే గెలుపు అవకాశాలు ఢిల్లీ జట్టు వైపు మొగ్గు చూపుతున్నాయి.