నవంబర్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు: కేటీఆర్

29-09-2020 Tue 18:58
KTR confidant about GHMC elections
  • పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసిన కేటీఆర్
  • టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం
  • 15 శాతం కార్పొరేటర్ల పనితీరు బాగా లేదని వ్యాఖ్యలు

తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేడు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. నవంబరు రెండో వారం తర్వాత ఎప్పుడైనా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగొచ్చని స్పష్టం చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా పార్టీ నేతలు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని సూచించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సర్వేలన్నీ టీఆర్ఎస్ వైపే ఉన్నాయని, ప్రభుత్వానికి, పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో మంచిపేరుందని అన్నారు. ఎంత కాదన్నా తమకు 91 సీట్లు వస్తాయని సర్వే రిపోర్టులు వెల్లడిస్తున్నాయని తెలిపారు.

అయితే, జీహెచ్ఎంసీ పరిధిలోని 15 శాతం మంది కార్పొరేటర్ల పనితీరు సరిగాలేదని, వారు తమ పద్ధతి మార్చుకుని నిత్యం ప్రజల్లో ఉండేందుకు ప్రాధాన్యమివ్వాలని కేటీఆర్ హితవు పలికారు. కాగా, బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, కార్పొరేటర్లు, పార్టీ ఇన్చార్జిలు హాజరయ్యారు.