విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి... పురందేశ్వరిని విమర్శించే అర్హత ఉందా?: అయ్యన్నపాత్రుడు

29-09-2020 Tue 18:35
TDP Senior leader Ayyanna Patrudu criticizes Vijayasai Reddy
  • పురందేశ్వరిపై విజయసాయి వ్యాఖ్యలు
  • విజయసాయి గంజాయి మొక్కలాంటివాడన్న అయ్యన్న
  • నందమూరి కుటుంబం తులసివనం లాంటిదని వెల్లడి

ఇటీవలే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన పురందేశ్వరిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పురందేశ్వరి జాతీయ నాయకురాలో, జాతి నాయకురాలో స్పష్టమైందని పేర్కొన్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఘాటుగా స్పందించారు.

విజయసాయిరెడ్డి ఒక జైలు పక్షి అని, నందమూరి కుటుంబం అంటే తులసివనం వంటిదని అభివర్ణించారు. విజయసాయికి పురందేశ్వరిని విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి గంజాయివనంలో గంజాయి మొక్క లాంటివాడేనని అన్నారు. అహంకారం నెత్తికెక్కి మాట్లాడుతున్నారా? అని మండిపడ్డారు.

విశాఖ భూకుంభకోణంపై సిట్ కాదు, దమ్ముంటే సీబీఐ దర్యాప్తు వేయండి అంటూ సవాల్ విసిరారు. ఈ కుంభకోణంలో రాజకీయ పార్టీల నేతలే కాదు, ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారని ఆరోపించారు. అందరి జాతకాలు బయటికి వస్తాయని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.