Sonu Sood: సోనూ సూద్ ను వెదుక్కుంటూ వచ్చిన ఐక్యరాజ్యసమితి పురస్కారం

  • సోనూ సూద్ కు స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డు
  • నా దేశ ప్రజలకు కొద్దిపాటి సాయం చేశానన్న సోనూ సూద్
  • వర్చువల్ కార్యక్రమంలో అవార్డు ప్రదానం
United Nations SDG Special Humanitarian Award for Sonu Sood

బహుభాషా నటుడు సోనూ సూద్ సేవలకు సరైన రీతిలో గౌరవం లభించింది. లాక్ డౌన్ కాలంలో ఆయన చేపట్టిన సహాయక చర్యలు ఐక్యరాజ్యసమితిని కూడా ఆకట్టుకున్నాయి. తాజాగా ఆయనను ఐక్యరాజ్యసమితి స్పెషల్ హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్ డీపీ)లో భాగమైన సస్టెయినబుల్ డెవలప్ మెంట్ గోల్స్ (ఎస్ డీజీ) కార్యాచరణలో భాగంగా ఈ అవార్డు ప్రదానం చేశారు.

సోమవారం సాయంత్రం జరిగిన ఓ వర్చువల్ ఈవెంట్ లో సోనూ సూద్ కు ఈ పురస్కారం అందించారు. దీనిపై సోనూ సూద్ మాట్లాడుతూ, దేశ ప్రజలకు చేయగలిగినంత సాయాన్ని చేశానని, ఏ ప్రయోజనం ఆశించకుండా కొద్దిపాటి సహాయక చర్యలు చేపట్టానని తెలిపారు. తన చర్యలను ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక అరుదైన గౌరవం అని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి గుర్తింపు పొందడం ఎల్లప్పుడూ ప్రత్యేకమేనని సోనూ సూద్ అభిప్రాయపడ్డారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు యూఎన్ డీపీకి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.

కాగా, ఇప్పటివరకు ఈ ఐక్యరాజ్యసమితి అవార్డు హాలీవుడ్ ప్రముఖులు లియొనార్డో డికాప్రియో, ఏంజెలినా జోలీ, ఫుట్ బాల్ లెజెండ్ డేవిడ్ బెక్ హామ్, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాలను వరించింది. ఇప్పుడు సోనూ సూద్ కూడా వీరి సరసన చేరారు.

More Telugu News