సుశాంత్ వ్యవహారంలో తన పేరు లాగుతున్నారంటూ పరువునష్టం దావా వేసిన సల్మాన్ ఖాన్ సోదరుడు

29-09-2020 Tue 17:00
  • సుశాంత్ వ్యవహారంలో అర్బాజ్ పై ప్రచారం
  • దిశ సలియాన్ మృతి వ్యవహారంలో ప్రమేయం ఉందంటూ పోస్టులు
  • పోస్టులు తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు
Bollywood producer Arbaaz Khan files defamatory suit in Bombay Civil Court

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వ్యవహారంలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, అనవసరంగా తన పేరును ఇందులోకి లాగుతున్నారంటూ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు, బాలీవుడ్ నిర్మాత అర్బాజ్ ఖాన్ ముంబై సివిల్ కోర్టులో పరువునష్టం దావా వేశారు. సుశాంత్ మరణంతో పాటు, సుశాంత్ మాజీ మేనేజర్ దిశ సలియాన్ మృతి వ్యవహారంలోనూ తన ప్రమేయం ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని అర్బాజ్ కోర్టుకు తెలిపారు.

ఈ ఫిర్యాదును విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... విభోర్ ఆనంద్, సాక్షి భండారీ అనే వ్యక్తులతో పాటు, జాన్ డో, అశోక్ కుమార్ అనే పేర్లతో సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులకు వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేసింది. అర్బాజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేసిన విధంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన కంటెంట్ ను వెంటనే తొలగించాలని కోర్టు వారికి స్పష్టం చేసింది.

ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో ట్వీట్లు, వీడియోలు, కామెంట్లు, ఇతర అంశాలు ఏవైనా అర్బాజ్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించేవిగా ఉంటే, వాటిని తొలగించాలని పేర్కొంది.