వాళ్లు మిమ్మల్ని ఒక్కమాట కూడా అనలేదు.. వాళ్ల ఇళ్లను కూల్చొద్దు: కంగనా రనౌత్

29-09-2020 Tue 15:25
BMC served notices to my neighbors says Kangana Ranaut
  • నన్ను  ఒంటరిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
  • నా పొరుగువారిని కూడా బెదిరిస్తున్నారు
  • అసమర్థ సీఎంను ప్రశ్నించకూడదా?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. ముంబైలోని కంగన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కొంత మేర కూల్చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలతో కూల్చివేత పనులు ఆగిపోయాయి. తాజాగా బీఎంసీపై కంగనా మరోసారి మండిపడింది.

తన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా బీఎంసీ బెదిరిస్తోందని ఆమె ట్వీట్ చేసింది. తనను ఒంటరిని చేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపింది. తనకు సపోర్ట్ చేస్తే వారి ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరించిందని చెప్పింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారెవరూ ఒక్క కామెంట్ కూడా చేయలేదని... వారి ఇళ్లను కూల్చివేయద్దని విన్నవించింది.

ముంబైలో గూండా ప్రభుత్వం నడుస్తోందని  కంగన వ్యాఖ్యానించింది. ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రిని ఎవరూ ప్రశ్నించకూడదా? అని మండిపడింది. వాళ్లు మనల్ని ఏం చేస్తారు? ఇళ్లను కూల్చి, చంపేస్తారా? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.