రాజమౌళి 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలో అల్లూరి, కొమురం భీం‌‌‌ చిన్నప్పటి పాత్రలు.. ఫొటోలు వైరల్

29-09-2020 Tue 13:32
komaram bheem alluri childhood characters in rrr
  • ఆర్‌ఆర్‌ఆర్‌లో బాలనటులు 
  • షూటింగులో బాల నటులు చక్రి, వరుణ్‌ బుద్ధదేవ్‌, స్పందన ఫొటోలు
  • కొమురం భీంగా చక్రి

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న అసలు సిసలైన మల్టీస్టారర్ సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌లో బాలనటులు కూడా ఉన్నట్లు తెలిసింది. షూటింగులో ఖాళీ సమయంలో ముగ్గురు చిన్నారులు రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్‌లతో కలిసి ఫొటోలు దిగి, సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. బాల నటులు చక్రి, వరుణ్‌ బుద్ధదేవ్‌, స్పందన చతుర్వేదికి సంబంధించిన ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
       
షూటింగులో మధుర జ్ఞాపకాలు అంటూ, దీన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నానని స్పందన పోస్ట్ చేసింది. ఈ బాల నటులంతా ఇప్పటికే పలు సినిమాల్లో నటించారు. ఇటీవల బాల నటుడు చక్రి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాము ఈ సినిమాలో కొమరం భీమ్‌ చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నట్లు వెల్లడించారు.

కాగా, అల్లూరి సీతారామరాజు  చిన్నప్పటి పాత్రను వరుణ్‌ బుద్ధదేవ్‌ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, సీత చిన్నప్పటి పాత్రలో స్పందన నటిస్తున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాలో సీతగా అలియాభట్ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో అజయ్‌ దేవగణ్‌, శ్రియ కూడా నటిస్తున్నారు.