జగన్, చంద్రబాబు, పవన్ లపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీపీఐ నారాయణ!

29-09-2020 Tue 13:09
These three are spoiling AP says CPI Narayana
  • ముగ్గురూ మోదీ కాళ్లు పట్టుకుంటున్నారు
  • జైలుకు వెళ్తాననే భయం జగన్ లో ఉంది
  • చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుంది

ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ల వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. వీరివల్లే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు.

రైతులకు ఎంతో నష్టం కలిగించే వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ, టీడీపీలు మద్దతు పలకడం దారుణమని విమర్శించారు. బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాననే భయం జగన్ లో ఉందని చెప్పారు. రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్షాలు రెండూ దివాలాకోరు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు.

ప్రధాని మోదీ కాళ్లను జగన్, చంద్రబాబు ఇద్దరూ పట్టుకుంటున్నారని నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కూడా ఆయన కాళ్లను పట్టుకుంటున్నారని అన్నారు. మూడు పెళ్లిళ్లు చేసుకుని మాసికం చేసుకున్నాడని చెప్పారు. గత ఎన్నికల్లో బుద్ధి తక్కువై పవన్ ని తాము నమ్మామని అన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్... చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు పట్టిన గతే జగన్ కు పడుతుందని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతే అని అన్నారు. తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు.