భారత్‌లో కార్యకలాపాలను నిలిపేస్తున్నాం: ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కీలక నిర్ణయం

29-09-2020 Tue 12:54
amnesty internations halts its activities in india
  • అప్రజాస్వామికంగా మా బ్యాంకు ఖాతాలు సీజ్ చేశారు
  • భారమైన హృదయంతో నిర్ణయం
  • భారత్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కు గడ్డు పరిస్థితులు 
  • మానవ హక్కుల ఉల్లంఘనలపై నివేదికలు పట్టించుకోవట్లేదు 

భారత దేశం నుంచి తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ కీలక ప్రకటన తెలిపింది. భారత ప్రభుత్వం అప్రజాస్వామికంగా బ్యాంకు ఖాతాలను సీజ్ చేసిందని అమ్నెస్టీ ఇండియా చెప్పుకొచ్చింది. ఈ నెల 10న తమ బ్యాంకు ఖాతాలన్నింటినీ ఈడీ పూర్తిగా స్తంభింపజేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో భారమైన హృదయంతో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

భారత్‌లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇండియా తాజాగా ఆరోపణలు చేసింది. భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలపై తామిచ్చిన నివేదికల నేపథ్యంలో తమ సభ్యులకు బెదిరింపులు ఎదురవుతున్నాయని చెప్పింది. మానవహక్కుల ఉల్లంఘనపై తాము లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడం సర్కారుకి ఇష్టం లేదని గ్రూప్ సీనియర్ రీసెర్చ్, అడ్వకేసీ అండ్ పాలసీ డైరెక్టర్ రజత్ ఖోస్లా చెప్పుకొచ్చారు.

ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కశ్మీర్ అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదని చెప్పారు. భారత్‌లో ఇక తాము సేవలు అందించలేమని తెలిపారు. మొత్తం 70కి పైగా దేశాలలో పనిచేస్తున్న తాము.. 2016లో రష్యాలో మాత్రమే కార్యకలాపాలను నిలిపేశామని అన్నారు. ఇప్పుడు భారత్‌లో మూసేస్తున్నామని చెప్పారు. తమ చట్టపరమైన కేసులపై మాత్రం పోరాటం కొనసాగిస్తామని చెప్పారు.