కరోనా ఎఫెక్ట్.. 'కార్తికేయ2' చిత్రంలో హీరోయిన్ మార్పు!

29-09-2020 Tue 12:28
Heoine changed in Karthikeya2 movie
  • నిఖిల్ హీరోగా 'కార్తికేయ2' చిత్రం
  • తొలుత హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఎంపిక
  • ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ కు ఛాన్స్

కరోనా మహమ్మారి కారణంగా సినీపరిశ్రమ ఎంతో నష్టపోయింది. షూటింగులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. షూటింగ్ పూర్తైన చిత్రాలు థియేటర్లు ప్రారంభం కాకపోవడంతో విడుదలకు నోచుకోలేదు. కొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీలో విడుదలయ్యాయి. ఇప్పుడు షూటింగులు మళ్లీ ప్రారంభం కావడంతో చిత్ర పరిశ్రమలో సందడి నెలకొంది. అయితే, నెలల పాటు చిత్రీకరణ ఆగిపోవడంతో పలు చిత్రాల్లో నటీనటులు మారిపోతున్నారు. డేట్స్ కుదరకపోవడమే దీనికి కారణం.

ఇదిలావుంచితే, నిఖిల్ హీరోగా గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం హిట్ అయింది. ఆరేళ్ల తర్వాత దీనికి సీక్వెల్ గా 'కార్తికేయ2'ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు చందు మొండేటి ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ ను సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే కరోనా  కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ఇక తొలుత ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే, చాలా గ్యాప్ రావడంతో ఆమె సైన్ చేసిన ఇతర ప్రాజెక్టులతో బిజీ అయింది. ఈ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోతోందట. దీంతో, ఆమె స్థానంలో ప్రియాంక అరుల్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నాని చిత్రం 'గ్యాంగ్ లీడర్'లో ప్రియాంక నటించింది.