Uma Bharti: జ్వరం ఎక్కువ కావడంతో ఆసుపత్రిలో చేరిన ఉమా భారతి

  • ఇటీవల కరోనా బారినపడిన బీజేపీ సీనియర్ నేత
  • వైద్యులు అనుమతిస్తే కోర్టుకు హాజరవుతానని ప్రకటన
  • ఉమ ఆరోగ్యంపై కేంద్రమంత్రి హర్షవర్ధన్ ఆందోళన
BJP Senior leader Uma Bharti admitted inAIIMS

ఇటీవల కరోనా బారినపడి క్వారంటైన్‌లో ఉన్న బీజేపీ సీనియర్ నేత, ఫైర్‌బ్రాండ్ ఉమా భారతి రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చేరారు. ఇటీవల ఆమె కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో  హరిద్వార్‌, రిషికేశ్‌ మధ్యనున్న వందేమాతరం కుంజ్‌ వద్ద క్వారంటైన్‌లో ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత మరోమారు పరీక్షలు చేయించుకుంటానని, పరిస్థితి ఇలాగే ఉంటే ఆసుపత్రిలో చేరుతానని ఉమా భారతి మొన్ననే తెలిపారు. జ్వరం ఏమాత్రం తగ్గకపోగా, మరింత పెరగడంతో తప్పని పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేరినట్టు ట్వీట్ చేశారు.

కాగా, పరీక్షల అనంతరం వైద్యులు కనుక తనకు అనుమతి ఇస్తే రేపు బాబ్రీ మసీదు కూల్చివేత కేసు తీర్పు వెలువడనున్న సందర్భంగా లక్నోలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరవుతానని తెలిపారు. నిజానికి తాను కోర్టుకు హాజరు కావాలన్న ఉద్దేశంతోనే ఆసుపత్రిలో చేరినట్టు పేర్కొన్నారు. తన ఆరోగ్యంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆందోళన చెందుతున్నట్టు తెలిపారు. తనకు రెండోసారి నిర్వహించిన పరీక్షల్లోనూ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు చెప్పారు.

More Telugu News