నేటి నుంచి ఒడిశా అసెంబ్లీ సమావేశాలు.. డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా!

29-09-2020 Tue 07:09
Odisha Deputy speaker and 11 MLAs diagnosed corona positive
  • శాసనసభ్యులు, పాత్రికేయులకు కరోనా పరీక్షలు
  • భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరిన డిప్యూటీ స్పీకర్
  • ఇప్పటి వరకు 9 మంది మంత్రులు సహా 50 మంది ఎమ్మెల్యేలకు సోకిన వైరస్

ఒడిశా డిప్యూటీ స్పీకర్ రజనీకాంత్ సింగ్‌తోపాటు 11 మంది ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. నేటి నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, పాత్రికేయులకు ప్రత్యేకంగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్, 11 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. మరికొందరి ఫలితాలు నేడు రానున్నాయి.

తనకు కరోనా సోకిందని, ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఓ ఆసుపత్రిలో చేరినట్టు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. మరోవైపు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీల మల్లిక్ ఆదివారం కరోనా బారినపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 9 మంది మంత్రులు సహా 50 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. వీరిలో పలువురి క్వారంటైన్ సమయం ఇప్పటికే ముగిసింది.