కోహ్లీ తప్ప అందరూ కొట్టారు... బెంగళూరు భారీ స్కోరు

28-09-2020 Mon 21:20
Royal Challengers Banglore registered huge total against Mumbai Indians
  • మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు
  • ఓపెనర్ల శుభారంభం
  • అర్ధసెంచరీలు సాధించిన పడిక్కల్, ఫించ్
  • రాణించిన డివిలియర్స్, దూబే
  • 3 పరుగులు చేసి నిరాశపరిచిన కోహ్లీ

ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ టాప్ ఆర్డర్ వీరవిహారం చేసింది. ఒక్క కెప్టెన్ కోహ్లీ (3) తప్ప మిగతా అందరూ ముంబయి బౌలింగ్ ను చీల్చి చెండాడారు. దాంతో నిర్ణీత 20 ఓవర్లలో బెంగళూరు జట్టు 3 వికెట్లకు 201 పరుగులు చేసింది.

ఓపెనర్ దేవదత్ పడిక్కల్ 54 (5 ఫోర్లు, 2 సిక్స్ లు), మరో ఓపెనర్ ఆరోన్ ఫించ్ 52 (7 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు సాధించారు. వీళ్లిద్దరూ తొలి వికెట్ కు 81 పరుగులతో శుభారంభం అందించగా, వన్ డౌన్ లో వచ్చిన కోహ్లీ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.

ఈ దశలో స్కోరు వేగం కాస్త తగ్గినట్టు అనిపించినా, ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్ లు), శివం దూబే (10 బంతుల్లో 27 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్ లు) ధాటిగా ఆడడంతో బెంగళూరు స్కోరు 200 దాటింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, రాహుల్ చహర్ ఓ వికెట్ సాధించారు. కోహ్లీ వికెట్ చహర్ కు దక్కింది.