దళితులు స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది: నక్కా ఆనందబాబు

28-09-2020 Mon 20:21
Dalits has to respond says Nakka Anand Babu
  • వైసీపీకి దళితులే అధికారాన్ని కట్టబెట్టారు
  • అందుకే వారిపై దాడి చేసే హక్కు ఉన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది
  • అంతా ఒక ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నట్టు అర్థమవుతోంది

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టింది దళితులేనని... అందుకే వారిపై దాడి చేసే హక్కు తమకు ఉందన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. చిత్తూరు జిల్లాలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై హత్యాయత్నం జరగడం దారుణమని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రమాదం పొంచి ఉందని... ఈ నేపథ్యంలో దళిత సంఘాలు స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.

దళితులపై ప్రభుత్వం దమనకాండకు దిగుతోందని... దీనిపై విజయవాడలో రామకృష్ణ మాట్లాడటం నేరమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తుంటే.. ఒక ప్రణాళిక ప్రకారమే అంతా జరుగుతున్నట్టు అర్థమవుతోందని చెప్పారు.