జడ్జి సోదరుడు రామచంద్ర, టీడీపీ నేత ప్రతాపరెడ్డి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు: చిత్తూరు ఎస్పీ సెంథిల్ కుమార్

28-09-2020 Mon 20:04
Chittoor SP Senthil Kumar speaks about B Kothakota issue
  • నిన్న జడ్జి రామకృష్ణ సోదరుడిపై బి.కొత్తకోటలో దాడి
  • ప్రత్యక్ష సాక్షులను విచారించామన్న ఎస్పీ సెంథిల్ కుమార్
  • రాడ్లు వాడినట్టు సీసీటీవీ ఫుటేజిలో ఎక్కడా లేదని స్పష్టీకరణ

చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్ర తీవ్రగాయాలతో పడి వున్న వీడియో నిన్నటి నుంచి సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. రామచంద్రపై వైసీపీ వాళ్లే దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని, దళితులపై దాడులు ఆగవా అంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ స్పందించారు.

జడ్జి సోదరుడు రామచంద్ర, ప్రతాపరెడ్డి పరస్పరం దాడి చేసుకున్నారని వెల్లడించారు. ప్రతాపరెడ్డి టీడీపీకి చెందిన నేత అని తెలిపారు. ఈ ఘటనలో ఇనుపరాడ్లు వాడినట్టు సీసీటీవీ ఫుటేజిలో ఎక్కడా లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని చెప్పారు.