20 రూపాయల కోసం కొట్టి చంపేశారు!

28-09-2020 Mon 20:01
Man beaten to death for 20 rupees
  • ఉత్తర ఢిల్లీలో దారుణం
  • వ్యక్తిని చితకబాదిన సెలూన్ ఓనర్, అతని తమ్ముడు
  • దాడిని అడ్డుకోవడానికి సాహసించని చుట్టుపక్కల జనాలు

రూ. 20 కోసం ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.13 ఏళ్ల కుమారుడి ముందే తండ్రిని ఇద్దరు వ్యక్తులు చంపేశారు. తన తండ్రిని కొడుతుండటాన్ని ఆ చిన్నారి ఆపేందుకు ఎంతో ప్రయత్నించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర ఢిల్లీలో భార్య, పిల్లలతో కలిసిన 38 ఏళ్ల రూపేశ్ నివసిస్తున్నాడు. క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న ప్రాంతం అది. షేవింగ్ కోసం దగ్గర్లో ఉన్న సెలూన్ కు రూపేశ్ వెళ్లాడు. షేవింగ్ పూర్తైన తర్వాత రూ. 50 ఇవ్వాలని సెలూన్ ఓనర్ సంతోష్ అడిగాడు. అయితే సంతోశ్ కు రూపేశ్ రూ. 30 ఇచ్చి, మిగిలిన రూ. 20 తర్వాత ఇస్తానని చెప్పాడు. దీంతో వివాదం ప్రారంభమైంది.

సంతోశ్, అతని సోదరుడు సరోజ్ ఇద్దరూ తమ సెలూన్ లో ఉన్న ప్లాస్టిక్ పైపుతో రూపేశ్ ను బాదారు. ఈ దాడిని ఆపేందుకు రూపేశ్ కొడుకు ప్రయత్నించాడు. ఈ దాడికి సంబంధించిన మొబైల్ వీడియో కూడా బయటకు వచ్చింది. చుట్టుపక్కల ఉన్న జనాలు దాడిని చూస్తున్నారేకాని... ఆపేందుకు ఎవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. రూపేశ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే అతను మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు, సంతోశ్, సరోజ్ లను పోలీసులు అరెస్ట్ చేశారు.