ఏపీలో కనిష్ఠ స్థాయిలో కరోనా మరణాలు, కొత్త కేసులు

28-09-2020 Mon 19:42
AP witnesses low in corona deaths and positive cases
  • గత 24 గంటల్లో 37 మంది మృతి
  • 5,487 మందికి కరోనా పాజిటివ్
  • 7,210 మందికి కరోనా నయం

ఇటీవల కాలంలో నిత్యం పెద్ద సంఖ్యలో కరోనా మరణాలు, పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో ఏపీలో ఆందోళనకర పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే కొన్నిరోజులుగా ఊరట కలిగించే రీతిలో కరోనా తగ్గుముఖం పడుతోందన్న దానికి సూచనగా మరణాల సంఖ్య తగ్గుతుండడమే కాదు, కొత్త కేసుల సంఖ్య కూడా దిగి వస్తోంది. తాజాగా ఏపీలో కనిష్ఠ స్థాయిలో మరణాలు, పాజిటివ్ కేసులు వచ్చాయి.

గడచిన 24 గంటల్లో ఏపీలో 37 మంది కరోనాతో చనిపోగా, 5,487 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అదే సమయంలో 7,210 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఓవరాల్ గణాంకాలు చూస్తే ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,81,161కి చేరుకోగా, మరణాల సంఖ్య 5,745కి పెరిగింది. 6,12,300 మంది కరోనా నుంచి విముక్తులు కాగా, ఇంకా 63,116 మంది చికిత్స పొందుతున్నారు.