Hindu Temples: హిందూ దేవాలయాలపై దాడులపై ఏపీ డీజీపీ స్పందన

  • మొత్తం 19 దేవాలయాలపై దాడులు జరిగాయి
  • 12 మంది నిందితులను అరెస్ట్ చేశాం
  • 10 శాతం ఆలయాల్లోనే సీసీ కెమెరాలు ఉన్నాయి
AP DGPs response on attacks on Hindu temples

హిందూ దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ, అంతర్వేది ఘటన తర్వాత రాష్ట్రంలోని అనేక దేవాలయాలపై దృష్టిసారించామని చెప్పారు. మొత్తం 19 దేవాలయాలపై దాడులు జరిగినట్టు కేసులు నమోదయ్యాయని... వీటికి సంబంధించి 12 మంది నిందితులను అరెస్ట్ చేశామని తెలిపారు. జరిగిన దాడులన్నీ ఒకదానితో మరొకటి సంబంధం లేకుండానే జరిగాయని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 47,593 ప్రార్థనా మందిరాలు ఉన్నాయని సవాంగ్ చెప్పారు. వీటిలో 28,567 దేవాలయాలు ఉన్నాయని, అయితే కేవలం 10 శాతం ఆలయాల్లో మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిపారు. చిత్తూరు జిల్లాలో నంది విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు అపవిత్రం చేశారనే ఫిర్యాదు అందిందని... దీనిపై అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు.

శ్రీకాకుళంలో దేవుడి చేయి విరిగిపోయిన ఘటనపై విచారణ జరిపామని... గత ఏడాది కురిసిన వర్షాల వల్లే విగ్రహం చేయి విరిగిపోయిందని విచారణలో తేలిందని అన్నారు. కర్నూలులో దేవతామూర్తి భాగాలను దొంగిలించిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని... తనకు పిల్లలు లేరని, విగ్రహంలో ఒక భాగానికి పూజ చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతోనే దొంగిలించానని నిందితుడు అంగీకరించాడని చెప్పారు.

More Telugu News